
మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానని అన్నాహజారే గర్జించారు.రెండుసార్ల అనుభవం దృష్ట్యా ఆయన ఆ మాట అని ఉండొచ్చు.మళ్లీ దీక్షఅంటే కేంద్రం గజగజ వణికిపోతుందని బహుశా ఆయన భావన అనుకుంటా. అవినీతి పై పోరాడుతున్న క్రూసేడర్ గా కీర్తినందుకుంటున్న అన్నాహజారే ఇలా దీక్ష నే పట్టుకుని వేలాడుతూ ప్రభుత్వాన్ని బెదిరించడం సరైన వైఖరిగా అనిపించడం లేదు. మరోసారి దీక్ష చేయాలని భావించడం తలా తోకాలేని వ్యవహారంలా కనిపిస్తుంది. తన బృందంలోని సభ్యులమీద వస్తున్న అనేకమైన ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రకటన చేసారని అనిపిస్తోంది. వ్యవస్దను జలగలా పీల్చిపిప్పి చేస్తున్న అవినీతిని రూపుమాపేందుకు తాను, తన టీం పోరాటగోదాలోకి దిగిందని అన్నాహజారే మొదట్నుంచీ చెబుతూన్నారు. జనలోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ ప్రభుత్వం మీద ,రాజకీయపార్టీల మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయన ఎంచుకున్న మార్గమేమిటి...?చేస్తున్న పనేమిటి...?గత ఏప్రిల్ లో ఆయన మొదటిసారి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం దిగివచ్చినట్లు నటించింది.తరువాత నైజాన్ని బైటపెట్టుకుంది. ఇది హజారే ఈగోను హర్ట్ చేసింది. మళ్లీ దీక్ష చేసారు.మీడియా భూతద్దం లో దేశం నావెంట కదిలొచ్చింది అని అనుకున్నారు.మొత్తానికి ప్రభుత్వం మాత్రం దిగొచ్చింది.కొన్ని సవరణలతో జన్ లోక్ పాల్ కు కట్టుబడి ఉన్నామని చెప్పింది.కానీ ఈ ఆరునెలల కాలంలో అన్నాహజారే అండ్ టీం మీడియా ముందుకు వచ్చినా ఒకటేచెప్పారు.జన్ లోక్ పాల్ బిల్ లావో..భ్రష్టాచార్ కో ఖతమ్ కరో...అంతకుమించి ఏమీ మాట్లడరు.బహుశా హజారే కు అవినీతిపై పోరాడమటమంటే తెలిసింది అదే అనుకుంటా.
పోరాటం ఎల్లప్పుడూ కొంతపుంతలు తొక్కుకుంటూ, తొణికిసలాడే విశ్వాసం తో ముందుకు సాగాలి. ఎన్ని అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కోవాలి.ఎప్పటికప్పుడూ కొత్త రూపు సంతరించుకోవాలి.మనం నిజాయితీ గా ఉంటూ ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలి. మీడియాముందుకొచ్చి స్పీచ్ లిస్తేనో, దీక్ష కూర్చుంటా అని బెదిరిస్తేనో ,అవినీతిని అంతం చేయండి పిలుపిలిస్తేనో జరిగిపోదు.అవినీతి నిర్మూలన అనేది దీర్ఘకాలిక పోరాటం. జన్ లోక్ పాల్ బిల్లు తోనే అవినీతి సమూలంగా నాశనమైపోదు. దానికి ఆమరణ నిరాహార దీక్ష ఒక్కటే ఆయుధం కూడా కాదు.మరోవైపు ఈ ఆరునెలల కాలంలో అన్నా హజారే , ఆయన టీం దేశానికి బాగానే పరిచయం అయ్యారు.ఇన్నాళ్లుగా వారు ఏం చేశారు...? ప్రభుత్వాన్ని పార్టీలను తిట్టడం తప్పిస్తే..అన్నాహజారే వెనుక మేం ఉన్నామంటూ మద్దతిచ్చిన యువతీ యువకులు ఏం చేస్తున్నారు..?వి ఆర్ విత్ యూ అన్నా అని టీవీ మైకుల ముందు నినదించిన యువత ఎందుకిప్పుడూ హాయిగా నిద్రపోతోంది. దీక్ష చేసినప్పుడు మాత్రమే వాళ్లు బైటకు వస్తారా..?అవినీతి మూలాలు, అవినీతి అడ్డుకట్టవేసేందుకు కనీసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకుఅన్నా టీం ఒక్కరైనా ,ఒక్కసారైనా ప్రయత్నించారా...ఎన్నిసార్లు దేశమంతా తిరిగారు.ఎంతమందిని కలుసుకున్నారు, ? అవినీతి సంగతి దేవుడెరుగు...కనీసం జన్ లోక్ పాల్ బిల్లు అంటే ఏమిటి..దాని వల్ల ప్రయోజనాలేంటి....అని కొంతమందికైనా తెలియజెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా ఐతే చేస్తున్న పోరాటానికి,పొందబోతున్న ఫలానికి సార్ధకత ఉండదు.
తన టీం నుంచి ఇద్దరు జారిపోయినా, ముఖ్యులందరిపై ఆరోపణల వర్షం కురుస్తుంటే అన్నా మౌనవ్రతాన్ని ఆశ్రయించడం చేతగానితనాన్ని, సమాధానం చెప్పుకోలేని దుస్దితినే సూచిస్తుంది తప్ప మరోటి కాదు.తన ఆరోగ్యం కోసం వైద్యుల సూచన మేరకు అని చెబుతున్నారు. మీడియా అంతా గోల చేస్తుంటే...తనచుట్టూ తిరిగినవాళ్లందరినీ తప్పుబడితే అన్నా కామ్ గా ఉండటం సమంజసం కాదు.అగేనెస్ట్ కరప్షన్ కోసం వస్తున్న విరాళాలు పక్కదారి మళ్లుతున్నాయన్న ఆరోపణలకు అన్నా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.ఆయనను నమ్ముకున్న మద్దతుదారుల అనుమానం తీర్చాల్సిన అవసరం లేదా.కేవలం రెండు నిమిషాలు మౌన వ్రతం పక్కన బెట్టి సమాధానం చెప్పవచ్చు కదా.
అవినీతి రూపేందుకు ప్రయత్నం చేయడం సాహసమే.ప్రశంసించాల్సిన విషయమే..అందుకే కేవలం ప్రభుత్వాన్ని,పార్టీని తప్పుబడుతూ ప్రయోజనం లేదు. లంచాలు ఇవ్వడం ,తీసుకోవడం అలవాటుగా చేసుకున్న వారిలో కూడా మార్పు రానవసరం లేదా?. అలా కానప్పుడు ఎన్ని జన్ లోక్ పాల్ లు వచ్చినా దేశంలోఇసుమంత కూడా మార్పు రాదు.
అన్నా ఇప్పటికైనా తన పోరాట దిశను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.దీక్ష ద్వారా కాదు నేరుగా ప్రజలను అన్నిరకాలుగా తన పోరాటంలో భాగస్వామ్యులను చేయాలి. ఆయన వెనుక ఉండేవాళ్లు నిజాయితీ గా ఉండేలా చూసుకోవాలి.అలా లేనివారిని నిరభ్యంతరంగా పక్కనబెట్టాలి.తన ఉద్దేశ్యాలేమిటో స్ఫష్టంగా ప్రజలముందుంచాలి. అవినీతి నరనరాన ఇంకిపోయిన భారత వ్యవస్ద ను మళ్లీ కడిగేయాలంటే అంత ఈజిగా అయ్యే పనికాదు.అందరినీ కలుపుకుపోవాలి.ఓర్పుకూడా ఉండాలి.లేకపోతే అన్నాబృందం కోరుకుంటున్న లక్ష్యం ఎండమావే అవుతుంది.
No comments:
Post a Comment