పిచ్చి వెర్రితలుల వేస్తూ,మనల్ని మతిలేనివారిగా మారుస్తోందనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఉండదు.11-11-11 అట.. 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లంట.... అన్ని అంకెలు ఒకటే నంబర్ అట..ఆ టైం లో పుడితే అదృష్ట లక్ష్మి వరిస్తుందంట.ఆ లక్ నిజమో కాదో తెలియదు కానీ. దానికోసం దాదాపు దేశంలో లక్షల సిజేరియన్లు జరిగాయంట.అనుకున్న సమయం కంటే ప్రసవం జరగాల్సిన టైం కంటే ముందు వెనుక ఉన్నవారు సరిగ్గా ఆ సమయానికే సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకున్నారంట...ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా....పిల్లలు పుట్టడం అనేది సహజమైన ప్రక్రియ.తల్లి కడుపులో పెరిగే పిండం బయటకు వచ్చేందుకు అనువైన సమయం అంటూ ఉంటుంది..అప్పుడే ప్రసవం జరిగితే తల్లి,బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎవడో ఏదో వాగాడని ,అదృష్టం పట్టుకుంటుందని అపోహపడి తొందరపడి ఇలా సిజరేయన్లు చేయించుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?మహిళలే ఇలాంటి కాన్పులు చేయించుకోడానికి డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారంట.హవ్వ ఎంత అమానుషం.
ప్రతీ మహిళా తల్లి కావాలని తపిస్తుంది.గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్ని కష్టాలెదురైనా భరిస్తుంది.నవమాసాలు మోసి బిడ్డను కంటుంది.వాళ్లకి ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటుంది. ఆపరేషన్ ద్వారా పుట్టే పిల్లల కంటే నార్మల్ డెలివరీ ద్వారా పుట్టేవాళ్లు ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు.నార్మల్ డెలివరీ కుదరని అత్యవసర సందర్భాల్లో వైద్యులు సిజేరియన్ చేస్తారు.ఏది ఏమైనా ఆపరేషన్ జరిగినంత సేపు టెన్షన్ తప్పదు.ఎవ్వరికి ఏమీ కాకూడదని దేవుడ్ని మొక్కుతూనే ఉంటాం .టెన్షన్ పడతాం.అంతా మంచి జరగాలని కోరుకుంటాం. ఇదంతా వేరే విషయం.
కానీ డేట్ కోసం ఆ టైం లోని పిల్లలు పుట్టాలని కోరుకుని ఆపరేషన్ చేయించుకోవడం ఎంత సిగ్గుచేటు.జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు కారణం ?ఆపరేషన్ వికటించి ఫ్యూచర్లో ఏమైనా ఆరోగ్యసమస్యలు ఏర్పడితే జీవితాంతం భాదే కదా ?ఈ మాత్రం వాళ్లకి తెలియదా? ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి అందమైన జీవితాన్ని ఆరోగ్యంగా వందేళ్ల పాటూ అనుభవించాల్సిన పిల్లలకు ఇలాంటి పిచ్చి పనుల ద్వారా మనమే ద్రోహం చేయాలనుకోవడం పాపం.వారి బంగరు భవిష్యత్తు కోసం ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే భావినిర్మాత జీవితాలతో ఆడుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు.
ఐనా వినిపించిన ఈ పనికిమాలిన కధలన్నీ నిజమవుతాయని ఆధారాలేంటీ?అన్నీ ఒకట్లు కలిస్తే అదృష్టం అని ఎలా చెప్పగలరు.ఐనా అన్ని ఒకట్లే ఎలా ఉంటాయి.ప్రస్తుత సంవత్సరం నవంబర్ 11 వ తేదీ 11.11.11 ఎలా అవుతుంది.11.11.2011 కదా కావాల్సింది. అంటే ఇది 11 వ సంవత్సరమా..లేక 2011 సంవత్సరమా… అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా...? డైట్లు రాసే ఫార్మట్ లో రకరకాల మార్పులు వస్తుంటాయి.2011 అని పూర్తిగా రాయలేక షార్ట్ కట్ లో అప్పుడప్పుడూ రాస్తుంటాం.ఎందుకంటే 11 అంటే 2011 అని ఈజీగా అర్దమవుతుంది.కానీ అది నిజం కాదు. ఖచ్చితమైన డేట్ అంటే 2011 అని రాయాల్సిందే.ఈ లెక్క ప్రకారం వరుసగా 1 నంబర్ రానేరాదు. పిచ్చికూతలు కూసారని, లక్ మీ సొంతం అంటే , నిజమేనని నమ్మి అనవసరంగా ఆపదలు కొనితెచ్చుకోవడం భావ్యం కాదు. అదృష్టం పేరుతో పిల్లల జీవితాలతో చెలగాటమాడటం సరైన సంస్కృతి కాదు.బుద్దిమాంద్యం ఉన్నవారే ఇలా చేస్తారనడానికి నేనెంతమాత్రం సందేహించను.
ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్యులు ప్రసవం కోసం సిజేరియన్లు ఆవాయిడ్ చేస్తున్నారని ఓ మెడికల్ సర్వే కుండబద్దలు కొట్టింది.ప్రశాంతమైన వాతావరణంలో సుఖప్రసవం జరగాలని అమ్మలూ కోరుకుంటున్నారంట.వైద్యులు కూడా వీలైనంత వరకూ నార్మల్ డెలివరీ చేయించేందుకే తల్లుల్ని ఒప్పిస్తున్నారంట.వారిని మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకు క్లాసులు కూడా కండక్టు చేస్తున్నారంట. అలా పుట్టిన పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని డాక్టరు పరిశోధన చేసి కనుక్కున్నారు. అన్ని తెలిసి ప్రపంచానికి అన్నిరకాల విజ్ఞానం అందించిన మనం ఇలాంటి విషపుమాయలో చిక్కుకుని ఊగిసలాడటం ఎంత వరకు సమంజసం…?ఇలాంటి విషపు ప్రచారాలకోసం నూరేళ్ల జీవితాలను పణంగా పెట్టడం మన దౌర్భాగ్యం కాక మరేమిటి?
